అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు.. ట్విస్టుల మీద ట్విస్టులు

Explosives outside Mukesh Ambani's house. ముంబయిలో వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద ఇటీవల ఓ వాహనంలోపేలుడు పదార్థాలు.. ట్విస్టుల మీద ట్విస్టులు

By Medi Samrat  Published on  8 March 2021 12:33 PM GMT
Explosives outside Mukesh Ambani’s house
ముంబయిలో వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద ఇటీవల ఓ వాహనంలో పేలుడు పదార్థాలు ఉండడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే..! ఆ వాహనం యజమాని హిరేన్ మన్సూఖ్ థానేలో శవమై కనిపించడంతో మరిన్ని కోణాలు బయటపడ్డాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించారు. కేసును స్వీకరించిన అనంతరం ఎన్ఐఏ వర్గాలు స్పందించాయి. కేసు మరోసారి నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. హిరేన్ మన్సూఖ్ మృతి కేసును మాత్రం ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. మొదట ఇది ఆత్మహత్య కేసు అయ్యుంటుందని భావించిన ఏటీఎస్ పోలీసులు అనంతరం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. హిరేన్ ను హత్య చేసి, నదిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.


ఫిబ్రవరి 25న ముంబయిలోని ముఖేశ్ అంబానీ నివాసం యాంటిల్లా వద్ద ఓ స్కార్పియో వాహనం నిలిపి ఉంచడం గుర్తించారు. అందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. ఆ వాహనం ఫిబ్రవరి 18న ఐరోలీ-ములుంద్ బ్రిడ్జి వద్ద చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. అంబానీ నివాసం వద్ద వాహనం నిలిపి ఉంచిన కేసులో సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు హిరేన్ ను హత్య చేసి ఉంటారన్న వాదనలు బలపడుతున్నాయి. ఈ కేసులో హిరేన్ ఒక్కడే సాక్షి అని భావించామని.. అతడు కూడా ప్రాణాలతో లేడని ఏటీఎస్ దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించారు.

పోలీసు అధికారులు తనను వేధిస్తున్నారని, ఈ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా థానే, ముంబయి పోలీస్ కమిషనర్లకు హిరేన్ మార్చి 2న లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 5న హిరేన్‌ అనుమానాస్పదంగా శవమై తేలాడు. వారం రోజుల క్రితమే తన వాహనం చోరీకి గురైందని హిరేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కందివాలి యూనిట్ క్రైమ్ బ్రాంచ్ అధికారిని కలవడానికి తాను థానేలోని ఘోడ్‌బందర్ ప్రాంతానికి వెళుతున్నానని హిరెన్ తన కొడుకుతో చెప్పి ఆటో రిక్షాలో బయలుదేరాడు. మార్చి 4, గురువారం రాత్రి 10.30 నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. శుక్రవారం ఉదయం వరకు హిరెన్ కనిపించకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు నౌపాడా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత థానేలోని కొలనులో నోటిలో గుడ్డలు గుక్కిన రీతిలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. తన సోదరుడు అత్మహత్య చేసుకునేంత పిరికవాడుకాదనీ, అతనికి ఈత కూడా బాగా వచ్చని హిరేన్ సోదరుడు వినోద్ మీడియాకు తెలిపారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల ఘటనల్లో ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి.


Next Story