ఫార్మా కంపెనీలో పేలుడు.. ఇద్ద‌రు మృతి

సరిగామ్‌లోని జిఐడిసివ‌ద్ద గ‌ల వాన్‌ పెట్రో కెమికల్ కంపెనీలో సోమ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా మంట‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 8:06 AM IST
ఫార్మా కంపెనీలో పేలుడు.. ఇద్ద‌రు మృతి

గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లాలో గ‌ల‌ ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభ‌వించింది. ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌గా మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

సరిగామ్‌లోని జిఐడిసివ‌ద్ద గ‌ల వాన్‌ పెట్రో కెమికల్ కంపెనీలో సోమ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా అవి కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. కెమిక‌ల్స్‌కు మంట‌లు అంటుకోవ‌డంతో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. మూడు అంత‌స్తుల గ‌ల బిల్డింగ్‌లో కొంత భాగం కుప్ప‌కూలింది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఎంతో శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌గా తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వల్సాద్ ఎస్పీ విజయ్ సింగ్ గుర్జార్ మాట్లాడుతూ.. సరిగమ్ జిఐడిసి వద్ద వాన్‌ పెట్రో కెమికల్ కంపెనీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన ఇద్ద‌రిని ఆసుపత్రిలో చేర్చారు. రెండు మృతదేహాలను వెలికితీశారు. అయితే ఇంకా మృతదేహాలను గుర్తించలేదు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story