తత్కాల్ టికెట్లలో ఆగని ఏజెంట్ల దోపిడీ..వేగవంత బుకింగ్ కోసం బాట్‌లు
రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టినా..తత్కాల్ టికెట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
By Knakam Karthik
తత్కాల్ టికెట్లలో ఆగని ఏజెంట్ల దోపిడీ..వేగవంత బుకింగ్ కోసం బాట్‌లు
రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టినా..తత్కాల్ టికెట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం నిబంధనలు పెట్టింది. రైల్వేశాఖ ఛార్జీలు పెంచడంతోపాటు మరికొన్ని మార్పులు కూడా చేసింది. తత్కాల్ టికెట్ బుకింగ్‌నకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. అంతే కాకుండా ఛార్ట్ ప్రిపరేషన్ కూడా ట్రైన్ బయల్దేరడానికి 8 గంటల ముందు చేస్తుంది.
అయితే ఈ తత్కాల్ టికెట్ల వేగవంత బుకింగ్ కోసం మార్కెట్‌లో అమ్మకానికి బాట్‌లను ఏజెంట్లు బహిర్గతంగా విక్రయిస్తున్నారు. 24 గంటల ముందు విడుదలయ్యే టికెట్లు సెకన్ల వ్యవధిలోనే అమ్ముడవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్‌లో 40కిపైగా ఏజెన్సీల గ్రూపులు క్రియాశీలకంగా దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఆర్‌సీటీసీ ఆధార్ ఆధారిత యూజర్ ఐడీలను రూ.360కి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఏజెంట్లు బాట్‌లో బుక్ చేస్తోన్న తత్కాల్ టికెట్లతో నిజమైన ప్రయాణికులకు నష్టం జరుగుతోంది.
బ్రౌజర్‌లో బాట్ ఇన్ స్టాల్ చేసి ఆటో ఫిల్‌తో వేగంగా బుకింగ్ చేసేందుకు ఏజెంట్లు కొత్త దందాకు తెరలేపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బాట్ లాగిన్లు 50 శాతం వరకు ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. “Dragon, JETX, Ocean” వంటి బాట్లకు ప్రత్యేక వెబ్‌సైట్లు అందుబాటులోకి తీసుకొచ్చి, వాటిని రూ.₹999 నుంచి రూ. 5000 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించింది. కాగా ఈ మాల్వేర్ ఫైళ్లు యూజర్ల సమాచారాన్ని దొంగిలించే ట్రోజన్ వైరస్‌గా గుర్తించారు.
మొదటి 30 నిమిషాల్లో ఏజెంట్ బుకింగ్స్‌పై రైల్వే శాఖ నిషేధం విధించింది. మరో వైపు 2.5 కోట్లు ఫేక్ IRCTC యూజర్ IDలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే చర్యలను రైల్వే శాఖ తీసుకుంటునప్పటికీ ప్రజల సమాచారాన్ని దొంగిలించే కొత్త రూపంలో తత్కాల్ బాట్‌లు నిజమైన ప్రయాణికుల హక్కులను హరించే విధంగా ఉంటున్నాయి.