నా కోడిని కావాలనే చంపేశారు.. పీఎస్‌లో ఫిర్యాదు

EX MLA son filed case on hen death.తన కోడిని ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేశారంటూ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు

By అంజి
Published on : 13 Sept 2021 9:23 AM IST

నా కోడిని కావాలనే  చంపేశారు.. పీఎస్‌లో ఫిర్యాదు

తన కోడిని ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేశారంటూ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. కోడికి శవ పరీక్ష నిర్వహించి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని యూపీ మహారాజ్‌గంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రిప్రకల్యాణ్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు రాజ్‌కుమార్ భారతి పక్షుల ప్రేమికుడు. అతడిని పక్షులంటే ఎంతో ప్రాణం. అతడు ఎన్నో పక్షులను పెంచుకుంటున్నాడు.

దీనిలో భాగంగానే అతడు ఓ కోడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. ఈ క్రమంలోనే ఆ కోడి ఆకస్మికంగా మృతి చెందింది. అయితే మృతి చెందిన కోడి పట్ల రాజ్‌కుమార్ అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేయాలంటూ సింధూరియన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం రాజ్‌కుమార్‌ భారతి మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నో పక్షులను పెంచి పోషిస్తున్నానని తెలిపారు. కోడి మృతిపై మాట్లాడుతూ.. తనని నచ్చని వారే కోడికి విషం పెట్టి చంపేశారంటూ ఆరోపణలు చేశాడు. కోడికి పోస్టుమార్టం చేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు.

Next Story