ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు
సల్వా జుడుం తీర్పు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఖండించారు
By Knakam Karthik
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు
సల్వా జుడుం తీర్పు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఖండించారు. నక్సలైట్లకు మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’కు చట్టవ్యతిరేకంగా 2011లో జస్టీస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ప్రముఖ సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు తాజాగా స్పందించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఏ.కే. పట్నాయక్, అబ్బయ్ ఓకా, గోపాల గౌడ, విక్రమ్‌జిత్ సేన్, కురియన్ జోసెఫ్, మదన్ లోకూర్, జే.చెలమేశ్వర్, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు గోవింద్ మథూర్, ఎస్. మురళీధర్, సంజిబ్ బ్యానర్జీ, అలాగే పలు హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు ఈ ప్రకటనపై సంతకం చేశారు. వీరు తమ సంయుక్త ప్రకటనలో “సల్వా జుడుం తీర్పు ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించదు. తీర్పును తప్పుగా అర్థం చేసుకోవడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించవచ్చు” అని పేర్కొన్నారు. అలాగే, ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికల ప్రచారం గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా సాగాలని, అభ్యర్థులపై పేరు పెట్టి విమర్శించడం మానుకోవాలని సూచించారు. 2011లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, గిరిజన యువతను ఆయుధాలు అందించి ప్రత్యేక పోలీస్ ఆఫీసర్లుగా (SPOs) మావోయిస్టులపై పోరాటానికి ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిన సంగతి తెలిసిందే.