ఓడిపోతే ఈవీఎంలు టాంఫ‌ర్ అవుతాయి.. గెలిస్తే మౌనంగా ఉంటారు.. రాజకీయ పార్టీలకు 'సుప్రీం' ఘాటు కౌంట‌ర్‌..!

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షాలు మళ్లీ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) అంశాన్ని లేవనెత్తారు.

By Medi Samrat  Published on  26 Nov 2024 8:00 PM IST
ఓడిపోతే ఈవీఎంలు టాంఫ‌ర్ అవుతాయి.. గెలిస్తే మౌనంగా ఉంటారు.. రాజకీయ పార్టీలకు సుప్రీం ఘాటు కౌంట‌ర్‌..!

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షాలు మళ్లీ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ఈవీఎంలపై ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించాల‌ని కోరుతూ కాంగ్రెస్ త‌రుపున‌ ప్రచారాన్ని ప్రకటించారు.

అయితే ఆయన ప్రకటనకు ముందు.. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై పిటిషనర్‌ను సుప్రీంకోర్టు గట్టిగా మందలించడమే కాకుండా రాజకీయ పార్టీలకు గట్టి సందేశం కూడా ఇచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు పాడైపోయాయ‌ని.. గెలిస్తే మౌనంగా ఉంటున్నార‌ని కోర్టు పేర్కొంది. ఓటమిని ఈవీఎంలపై నిందించడం సరికాదన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, పిబి వరాలే ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. ఈ పిల్‌ను డాక్టర్ కెఎ పాల్ కోర్టులో దాఖలు చేశారు.

ఈ సమయంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేయాలనే అద్భుతమైన ఆలోచన మీకు ఎలా వచ్చింది అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. దీనిపై పాల్ మాట్లాడుతూ.. మూడు లక్షల మందికి పైగా అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు తాను అధ్యక్షుడినని చెప్పారు. అలాంటప్పుడు మీరు రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు? అని ప్ర‌శ్నించ‌గా.. దీనిపై పాల్ మాట్లాడుతూ.. తాను ప్రపంచంలోని 150కి పైగా దేశాలను సందర్శించానని చెప్పారు. ఈ దేశాల్లో చాలా వరకు ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతోందన్నారు.

ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మనం ఎందుకు భిన్నంగా ఉండకూడదని కోర్టు ప్ర‌శ్నించింది? దీనికి అవినీతి పెరుగుతోందని పాల్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఎన్నికల కమీషన్ స్వయంగా తొమ్మిది వేల కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే అవినీతి ఉండదని ఎలా చెబుతారని కోర్టు ప్ర‌శ్నించింది. తన పిటిషన్‌కు 18కి పైగా రాజకీయ పార్టీల మద్దతు ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారు.

దీనిపై కోర్టు మాట్లాడుతూ.. ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎం హ్యాక్ అయ్యాయ‌ని.. పాడ‌య్యాయ‌ని .. గెలిచి ముఖ్యమంత్రి కాగానే ఈవీఎంలు ప‌నితీరుపై మౌనం వ‌హించార‌ని అన్నారు. జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇదే ఆరోపణ చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఎట్టకేలకు కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

Next Story