ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం..క్లెయిమ్ చేయని పీఎఫ్ నిధులు ఇక నేరుగా మీ ఖాతాలోకి!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
By - Knakam Karthik |
ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం..క్లెయిమ్ చేయని పీఎఫ్ నిధులు ఇక నేరుగా మీ ఖాతాలోకి!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతాలలోని నిధులను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే, ఆధార్‌తో అనుసంధానమైన వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ అవుతాయి.
నివేదికల ప్రకారం, తొలి దశలో సుమారు 8 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలను గుర్తించి, వాటిలో ఉన్న రూ. 5,200 కోట్ల నిధులను ప్రాసెస్ చేయనున్నారు. వీటిలో 14,000 ఖాతాల్లో రూ. 5 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల ఖాతాల్లో రూ. 10,181 కోట్ల డిపాజిట్లు నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణంగా ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యి, వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయకపోతే ఆ ఖాతాను ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అప్పటి నుండి ఆ నిధులపై వడ్డీ జమ కావడం ఆగిపోతుంది.
ఇప్పటికే రూ. 1,000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాల ఆటోమేటిక్ సెటిల్‌మెంట్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలపగా, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉన్న నిధులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును సంస్థ ఇప్పటికే ఖరారు చేసింది.