కరోనాతో చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ మృతి

Environmentalist Sunderlal Bahuguna passes away. ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కరోనాతో కన్నుమూశారు

By Medi Samrat  Published on  21 May 2021 11:28 AM GMT
Sunderlal Bahuguna

ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కరోనాతో కన్నుమూశారు. గత కొంత కాలం గా కరోనాతో రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. డయాబెటిస్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన కరోనా నుంచి కోలుకోపోయారు. ఈక్రమంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా హిమాలయాల్లో అడవుల సంరక్షణం కోసం, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. చిప్కో అంటే ఆలింగనం అని అర్ధం. చెట్లను కొట్టివేస్తున్నప్పుడు ప్రజలు చెట్లకు ఆలింగనం చేసుకోవడం ద్వారా శాంతి యుతంగా చేపట్టిన ఉద్యమంగా చిప్కో ఉద్యమం నిలిచిపోయింది.

తెహ్రీ డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఆయన అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ఆయన చేసిన కృషి, పట్టుదల కారణంగానే అడవుల నరక్కుండా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిషేధం విధించారు. 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్‌ వంటి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు పొందిన ఆయన వృక్షాలే కాదు.. అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కడ దాకా పరితపించారు. బహుగుణ మృతిపై ప్రధాని మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. ఆయన నిరాడంబరత, నిబద్ధతతో కొనసాగించిన పోరాట స్ఫూర్తిని మరువలేమన్నారు. వారి కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


Next Story