వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు మాతృ భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానుందని, ఇందు కోసం కొన్ని ఐఐటీ, ఎన్‌ఐటీలను ఎంపిక చేస్తామని తెలిపాయి. స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్థులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని యూజీసీకి సమావేశంలో సూచించారు.
టెక్నికల్ కోర్సులను ఇంగ్లీష్‌లో కాకుండా స్థానిక భాషల్లో బోధించడం సవాల్‌తో కూడుకున్న పని అని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం కత్తిమీద సాములాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు మాతృభాషల్లో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావాలని, సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.