ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అందజేస్తున్న దినసరి కూలీ డబ్బులను పెంచనున్నట్టు పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలి అమల్లోకి వస్తుంది. 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. పథకం ప్రారంభంలో దినసరి కూలి 87.50 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం 272 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎండా కాలంలో 3 నెలల పాటు ఉపాధి పనులు పుష్కలంగా దొరుకుతాయి.
కూలీలు పొద్దున్న, సాయంత్రం రెండు పూటలా పనులు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా అదనపు కూలీ కూడా పొందవచ్చు. తాజాగా కూలీ పెంచిన కేంద్రం.. ఎంత మేరకు పెంచింది చెప్పలేదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేదని తెలిపారు. ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూలీలకు అదనపు కూలి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పనుల ప్రదేశంలో వసతులు కల్పించాలని కూలీలు మొర పెట్టుకుంటున్నారు. టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.