ఎలోన్ మస్క్ కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ వెంచర్, స్టార్‌లింక్ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తుది నియంత్రణ అడ్డంకిని తొలగించింది. బహుళ నివేదికల ప్రకారం భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) కంపెనీకి ఆమోదం తెలిపింది. భారత దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఒక అడుగు ముందుకు పడింది. 2022 నుండి భారతదేశంలో అధికారికంగా సేవలను ప్రారంభించటానికి వేచి ఉన్న స్టార్‌లింక్‌కు ఇది ఒక ప్రధాన ఘట్టమని చెప్పుకోవచ్చు.
కంపెనీ ఇప్పటికే గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుండి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ పొందింది. ఇప్పుడు IN-SPACe ఆమోదంతో, స్టార్‌లింక్ ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్‌లింక్ కూడా త్వరలో భారత్ లో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి వాణిజ్య ప్రారంభానికి ముందు కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం.