టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సర్కార్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యంగ్య, కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ప్రకారమే జరుగుతాయని వ్యాఖ్యానించింది. గోషామహల్ నియెజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అనర్హులుగా ప్రకటించాలని నోటీసులివ్వాలని టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా రాజాసింగ్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నందున ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది రాజా సింగ్ పదవీకాలం కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జ్యోతిష్యం ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారించాలంటే అన్ని గ్రహాలు కలిసి ఒకే వరుసలోకి రావాలి కావచ్చు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జనవరికి వాయిదా వేశారు.