తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాలు సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఫిబ్రవరి 15 తర్వాత విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారులు దక్షిణ భారతంలోని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అయితే వీరి పర్యటన ఫిబ్రవరి 15తో ముగుస్తుంది. పర్యటన అనంతరమే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంటున్నారు.
ఫిబ్రవరి చివరి వారంలో కానీ, మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందజేయనున్నాయని తెలుస్తోంది. 10,12 తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో మే 1లోపునే ఎన్నికలు ముగించేందుకు ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల సంఘం అధికారుల పర్యటనలో సేకరించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ ఆరోరాకు త్వరలోనే నివేదించనున్నారు. ఈ నివేదిక అందిన అనంతరం ఎన్నికల షెడ్యూల్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దశల వారీగా ఎన్నికలు..
ఇక పశ్చిమ బెంగాల్‌లో ఆరు లేదా ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అలాగే అసోంలో రెండు లేదంటే మూడు దశల్లో ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీకి ఒకే రోజు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకే రోజు ప్రకటించేందుకు ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోందని అంటున్నారు.
అయితే ఈ రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఇప్పటి నుంచి సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం ఇప్పటి నుంచే దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.