సాధారణంగా మనకు చికెన్, మటన్ కావాలంటే ఏం చేస్తాం..? ఏముంది దగ్గరలోని మాంసం షాపుల్లో తెచ్చుకుంటాం. కానీ ఓ చోట మాత్రం వీటికోసం.. సులభ్ కాంప్లెక్స్ కు వెలుతున్నారు. వినడానికి ఎబ్బేటుగా ఉన్న ఇది మాత్రం నిజం. ఓ వ్యక్తికి సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని అప్పజెప్పితే.. అతడు దాన్ని మటన్, గుడ్లు అమ్మే కేంద్రంగా మార్చేశాడు. ఓ పక్కన మాంసం అమ్మకాలు..మరోపక్క..మలమూత్ర విసర్జనలు జరుగుతున్న ఈ వింత విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిథిలోని సులభ్ కాంప్లెక్స్ లో జరిగింది. మున్సిపల్ అధికారుల తనిఖీలో ఈ విషయం బయటపడింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిథిలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహించే బాద్యతను ఓ వ్యక్తికి అప్పగించారు. అందుకు అతడికి జీతంతో పాటు.. అక్కడి వచ్చే వ్యక్తులు పైసలు కూడా ఇస్తున్నారు. ఈ ఆదాయంతో సంతృప్తి చెందని ఆ వ్యక్తి.. అక్కడ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. దాని ముందే మటన్, గుడ్ల అమ్మకం మొదలు పెట్టాడు. ఇతడి నిర్వాకాన్ని కొందరు మున్సిపాల్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇండోర్ మున్సిపాల్ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో.. అడ్డంగా దొరికిపోయాడు. అతడిపై మండిపడిన అధికారులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
అదే సమయంలో సులభ్ కాంప్లెక్స్‌లను నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు రూ.20వేల జరిమానా విధించారు. ఇతడి నిర్వాకం వల్ల అటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు, ఇటు సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు కూడా అప్రతిష్టకు గురయ్యారు. సులభ్ కాంప్లెక్స్‌లో మటన్, గుడ్ల వ్యాపారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు చక్కర్లుకొడుతున్నాయి.