బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండదు - షాకిచ్చిన పళనిస్వామి
తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా అంతా సఖ్యంగా లేదు.
By Medi Samrat
తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా అంతా సఖ్యంగా లేదు. తమిళ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అంగీకరించదని, బీజేపీతో పొత్తు ఎన్నికల కోసమేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) బీజేపీకి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి గెలిస్తే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడదని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ వెలుపల అన్నాడీఎంకే నేత పళనిస్వామి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కూటమిని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దీనికి సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అధికార డీఎంకే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా పళనిస్వామి సభ నుంచి వాకౌట్ చేశారు. ఇటీవల అమిత్ షా చేసిన ప్రకటనను మీడియా తప్పుగా అర్థం చేసుకోవడంపై ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో కూటమికి నేనే నాయకత్వం వహిస్తానని, జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారని అన్నారు. ఇది సాధారణ విషయం కానీ అస్పష్టంగా ఉందన్నారు.
కాగా.. ఏప్రిల్ 11న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, పళనిస్వామితో కలిసి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)-బీజేపీ కూటమిని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఇదిలావుంటే.. ఈ పొత్తుపై చాలా మంది అన్నాడీఎంకే నేతలు సంతోషంగా లేరని, దీని కారణంగా దాని ట్రాక్ రికార్డ్ పేలవంగా ఉందని చెబుతున్నారు. వక్ఫ్ బిల్లుపై తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మైనారిటీ ఓట్లు గల్లంతు కావడం పార్టీకి ఇష్టం లేదు.