రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
ED quizzes Rahul for 2nd consecutive day in National Herald money-laundering case. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2022 7:25 AM GMTకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో వరుసగా రెండో రోజు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన రాహుల్ గాంధీ తొలుత ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి నుంచి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ వెంటన ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
కాగా.. ఈడీ విచారణను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం చుట్టు పక్కల 144 సెక్షన్‌ను విధించారు. అయినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రణ్‌దీప్ సుర్జేవాలా, దీపందర్ సింగ్ హుడా, కేసీ వేణుగోపాల్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ తదితరులు ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తుగ్గక్ రోడ్డు పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించారు.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో సమన్లు అందుకున్న రాహుల్ గాంధీ సోమవారం ఉదయం 11.10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 10 గంటల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు. ఈ రోజు మరోసారి తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాగా.. ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. అయితే.. కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరడంతో జూన్ 23న హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.