మమతా బెనర్జీకే కాదు.. బీజేపీకి కూడా ఊహించని షాక్..!

EC issues showcause notice to Dilip Ghosh. ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో పాల్గొంటున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

By Medi Samrat  Published on  13 April 2021 9:13 AM GMT
మమతా బెనర్జీకే కాదు.. బీజేపీకి కూడా ఊహించని షాక్..!

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో పాల్గొంటున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌ ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఒకరోజు పాటు ప్రచారంలో పాల్గొనకూడ‌దంటూ ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించింది. ఆమె ప్రచారానికి 24 గంటలు దూరంగా ఉండాలని నోటీసులు జారీచేసింది. బెంగాల్‌లో ముస్లింలంతా క‌లిసి తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థులకే ఓటేయాలని.. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాల‌ని, వారిపై తిరగబడాల‌ని ప్రజలను రెచ్చగొట్టడం వంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై ఈసీ ఆ నిర్ణ‌యం తీసుకుంది. తాను ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించానంటూ ఈసీ తీసుకున్న నిర్ణ‌యంపై ధ‌ర్నా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పిన‌ట్లుగానే ధ‌ర్నాకు దిగారు. కోల్‌కతాలోని గాంధీ విగ్రహం దగ్గర వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె ఇందులో పాల్గొంటున్నారు.

ఇప్పుడు బీజేపీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. కూచ్ బెహార్ కాల్పుల ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, హబ్రా అభ్యర్థి రాహుల్‌ సిన్హాను ప్రచారానికి 48 గంటల పాటు దూరంగా ఉండాలని ఆదేశించింది. రాహుల్ సిన్హా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌లపై ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కూచ్ బెహార్‌ హింసాత్మక ఘటనకు ఆజ్యం పోసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. సీతల్‌కుచ్‌లో చనిపోయింది ఎనిమిది మందని, నాలుగురు కాదని రాహుల్ సిన్హా వ్యాఖ్యలు చేశారు. ఇక, దిలీప్ ఘోష్ ఏప్రిల్ 11న ఓ సభలో మాట్లాడుతూ.. ఒకవేళ ఎవరైనా తమ పరిధులు దాటితే సీతల్‌కుచ్ ఘటనలే పునరావృతం అవుతాయని వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను ఈసీకీ టీఎంసీ సమర్పించింది. దీంతో వారిపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది.


Next Story
Share it