ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి తన 99 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పుర్ జిల్లాలోని పీఠంలో తుదిశ్వాస విడిచారు. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. స్వరూపానంద సరస్వతి1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో జన్మించాడు. ఆయన తొమ్మిదవ ఏటనే ఇంటి నుంచి వెళ్లిపోయారు.
తరువాత ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి వెళ్ళాడు. అక్కడ స్వామి కర్పాత్రి మహారాజ్ నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మతపరమైన జ్ఞానం పొందాడు. అప్పటి నుంచి మత ప్రచార యాత్రలు చేపట్టారు. స్వరూపానంద సరస్వతి స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1942లో మహాత్మ గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 19 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా స్వరూపానంద సరస్వతి పేరు తెచ్చుకున్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి.. ఆయన తొమ్మిది నెలలు వారణాసి, ఆరు నెలలు మధ్యప్రదేశ్‌లోని ఓ జైలులో గడిపారు.
1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం న్యాయపోరాటం చేసిన ప్రముఖులలో ఆయన ఒకరు. హిందువులను ఏకం చేయాలనే సంకల్పంతో ఆది గురు శంకరాచార్య దేశంలో నాలుగు మత రాజధానులను చేశారు. అందులో ద్వారక పీఠానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు స్వరూపానంద సరస్వతి. ఛత్తీస్‌గఢ్‌లోని నర్సింగపూర్‌లోని పరమహంసి గంగా ఆశ్రమంలో ఆయన భౌతికకాయానికి సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.