బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని.. జైలులో ఉన్న సంగతి తెలిసిందే..! ఆర్యన్ తో సంబంధాలు ఉన్న పలువురు స్టార్ కిడ్స్ ను విచారిస్తూ ఉంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అయితే కొందరు నాయకులు ఈ ఘటనను రాజకీయంతో ముడిపెడుతూ ఉండడమే కాకుండా.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నాడు ఆయన మాట్లాడుతూ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ దొరకడంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో అరెస్టయిన నిందితులలో సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండగా.. షారుఖ్ ఖాన్ బీజేపీలో చేరితే డ్రగ్స్ కాస్తా షుగర్ పౌడర్ అవుతుంది అని అన్నారు.
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసును విచారించడానికి బదులుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే సెంట్రల్ ఏజెన్సీ షారూఖ్‌పై దాడి చేసిందని ఆయన ఆరోపించారు. షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరితే డ్రగ్స్ షుగర్ పౌడర్ అవుతాయని ఈ ఎన్సీపీ సీనియర్ నేత చమత్కరించారు. ఎన్‌సిపి కార్యక్రమంలో మాట్లాడిన ఛగన్ భుజ్బల్ ఓబిసి కోటాపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, అయితే బీజేపీ అడ్డుకుంటూ దానిని కోర్టులో సవాలు చేసిందని అన్నారు.