అయోధ్య ట్రస్ట్ కీలక నిర్ణయం.. వాటిని పంపొద్దని విజ్ఞప్తి
Don't donate silver bricks Ram Mandir trust tells donors. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి వెండి ఇటుకలు పంపడం ఆపాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
By Medi Samrat Published on 19 Feb 2021 10:00 AM ISTఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణ వేగవంతంగా జరుగుతోంది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ విరాళాల కోసం దేశ వ్యాప్తంగా లక్షా 50 వేల గ్రూపులను ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు రూ.1600 కోట్ల వరకు విరాళాలు అందినట్లు సమాచారం.
రామ మందిర నిర్మాణం కోసం ఎలాంటి వర్గాల వారైనా రూ.10 నుంచి వెయ్యి అపై వరకు విరాళాలు అందించవచ్చని పేర్కొంది. దీంతో రూ.10 నుంచి రశీదులను సైతం ముద్రించింది ట్రస్ట్. అంతేకాదు రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యే విధంగా చర్యలు చేపడుతోంది. ఇక దేశ వ్యాప్తంగా విరాళాల ప్రక్రియ ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. అయితే విరాళాలతో పాటు చాలా మంది డబ్బులతో పాటు భక్తితో మరింత విలువైనవి కూడా విరాళాలుగా సమర్పించుకుంటున్నారు. అలా పంపుతున్న వాటిలో వెండి ఇటుకలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ సహా చాలా నగరాలు, పట్టణాల నుంచి భక్తులు శ్రీరామునిపై భక్తితో వెండి ఇటుకలను తయారు చేయించి పంపుతున్నారు. అయితే ఇకపై వెండి ఇటుకలు పంపడం ఆపాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటి వరకు 400 టన్నుల వెండి ఇటుకలు
కాగా, రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే పెద్ద ఎత్తున వెండి ఇటుకలు విరాళాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. సుమారు 400 టన్నుల వెండి ఇటుకలు రావడంతో వాటన్నింటిని బ్యాంకు లాకర్లలో భద్రపరిచారు. బ్యాంకు లాకర్లు కూడా ఖాళీ లేకపోవడంతో ఇలాంటివి పంపవద్దని అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ కోరుతోంది. ఇలా దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి వెండి ఇటుకలు విరాళాల రూపంలో పంపుతున్నారు.
ఇలా పెద్ద మొత్తంలో వెండి ఇటుకలు రావడంతో వాటిని ఎలా భద్రపర్చాలనే విషయం ఇప్పుడు ట్రస్ట్‌కు ప్రశ్నార్థకంగా మారింది. లాకర్లన్నీ పూర్తిగా వెండి ఇటుకలతో నిండిపోయాయి. రాముని మీద అందరికీ భక్తి ఉంది. రామునిపై ఉన్న భక్తిని మేము అర్థం చేసుకోగలం. దయ చేసి మా విన్నపాన్నిమన్నించండి. వెండి ఇటుకలు పంపవద్దు. వెండి ఇటుకలను భద్రపర్చడానికి మేము ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.. అని శ్రీరామ జన్మభూమి టస్ట్ విజ్ఞప్తి చేస్తోంది. ఒక వేళ భవిష్యత్తులో వెండి అవసరం ఉంటే అప్పుడు మళ్లీ తాము భక్తులకు విజ్ఞప్తి చేస్తామని చెబుతోంది.
అయితే దేశ వ్యాప్తంగా 1,50,000 గ్రూపులు నిధులను సేకరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రజల నుంచి ఆలయ నిర్మాణం కోసం చందాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.1600 కోట్ల నిధులు సమకూరినట్లు తెలుస్తోంది. ఇక రామ మందిర నిర్మాణం 39 నెలల్లో పూర్తి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.