వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే అమానవీయ ఘటనకు సాక్షాత్కారంగా నిలిచింది ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కళాశాల. మరణించిన ఓ వ్యక్తి శరీరాన్ని కుక్కలు పీక్కుతిన్న హేయమైన ఘటన ఈ ఆస్పత్రిలో జరిగింది.
మృతుడిని రాజేంద్ర నగర్ కు చెందిన సంజయ్ గా గుర్తించారు. మార్చి 16న ఆస్పత్రిలో చేరిన అతడు.. మెడికల్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే... అతని మృతదేహం శనివారం ఆస్పత్రి ప్రధాన క్యాంపస్ లో అనుమానాస్పద రీతిలో పడిపోయి ఉంది. ఫ్లోర్ పై ఉన్న శవాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. మృతుడి చెవులు, ముక్కుతో పాటు సగం ముఖాన్ని తినేశాయి. సెక్యూరిటీ గార్డులు మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి పడిపోవడం వల్లే సంజయ్ మరణించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కడుపులో ఓ వ్యాధితో సంజయ్ ఆస్పత్రిలో చేరాడని అతని తల్లి యశోదా దేవి తెలిపారు. శనివారం ఉదయం 4 గంటలకు లేచి.. ఉపశమనం కోసం వార్డు బయటకు వెళ్లాడని చెప్పారు. ఎంతసేపటికీ లోపలికి రాలేదని.. తీరా వెతికేసరికి కింద ఫ్లోర్ పై పడి ఉన్నాడని వివరించారు. అక్కడ ఉన్న వీధి కుక్కలను తరిమేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.