చిన్నారులపై బ్లాక్ ఫంగ‌స్ పంజా.. ముగ్గురు పిల్ల‌ల క‌ళ్లు తొల‌గింపు

Doctors Remove Eyes of Three Children in Mumbai.క‌రోనా నుంచి ఇంకా కోలుకోక ముందే బ్లాక్ ఫంగ‌స్(ముకోర్మైకోసిస్)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 7:36 AM GMT
చిన్నారులపై బ్లాక్ ఫంగ‌స్ పంజా.. ముగ్గురు పిల్ల‌ల క‌ళ్లు తొల‌గింపు

క‌రోనా నుంచి ఇంకా కోలుకోక ముందే బ్లాక్ ఫంగ‌స్(ముకోర్మైకోసిస్) భ‌య‌పెడుతోంది. ఇంత వ‌ర‌కు పెద్ద‌వారిలో మాత్ర‌మే క‌నిపించిన ఈ వ్యాధి తాజాగా చిన్నారుల్లో కూడా వెలుగుచూసింది. బ్లాక్ ఫంగ‌స్ కార‌ణంగా ముగ్గురు చిన్నారుల నేత్రాల‌ను(క‌ళ్ల‌ను) తొల‌గించాల్సి వ‌చ్చింది. వీరిలో4,6,14 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఫంగస్‌ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో.. మరొకరి వేరేక ఆస్పత్రిలో శ‌స్త్ర‌చికిత్స ద్వారా ఒక కన్నును తొలగించారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. నాలుగు, ఆరేళ్ల వ‌య‌సు ఉన్న‌చిన్నారులు క‌రోనా బారిన ప‌డ్డారు. అనంత‌రం వీరిలో బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. చిన్నారులిద్దరిని ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్‌ ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత చిన్నారులిద్దరికి ఆపరేషన్‌ చేసి కన్ను తొలగించారు. సర్జరీ చేసి కన్ను తొలగించకపోతే ఆ చిన్నారుల‌ జీవితం ప్రమాదంలో ప‌డేద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

మ‌రో ఆస్ప‌త్రిలో డయాబెటిస్‌ సమస్యతో 14 ఏళ్ల బాలిక చేరింది. అయితే.. ఆస్ప‌త్రిలో జాయిన్ అయిన 48 గంట‌ల్లో బాలిక కన్ను పూర్తిగా నల్లగా మారింది. ఫంగస్‌ ముక్కు వరకు సోకింది. బాలిక అదృష్టం కొద్ది మెదడుకు చేరలేదు. బాలిక పరిస్థితి విషమిస్తుండటంతో డాక్ట‌ర్లు ఆమెకు చికిత్స ప్రారంభించారు. దాదాపు ఆరు వారాల పాటు వైద్యం చేసినప్పటికి.. ఫలితం లేకపోయింది. చివరకు బాలిక కంటిని తొలగించాల్సి వచ్చింది.

పిల్ల‌ల‌కు బ్లాక్ ఫంగ‌స్ సోక‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని డాక్ట‌ర్లు అన్నారు. క‌రోనా నుంచి కోలుకున్న 4, 6 ఏండ్ల వారికి మ‌ధుమేహం లేద‌ని, 14 ఏండ్ల బాలిక‌తోపాటు క‌రోనా నుంచి కోలుకున్న‌ మ‌రో 16 ఏండ్ల బాలికకు అనంత‌రం మ‌ధుమేహం వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. డ‌యాబెటిస్ వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లున్న క‌రోనా రోగుల‌ను బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష్యంగా చేసుకుంటున్న‌ద‌ని, క‌రోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇది ప్రమాదకరంగా మారుతున్న‌ద‌ని వెల్ల‌డించారు.

Next Story
Share it