అనుచితంగా ప్రవర్తిస్తే వైద్యం నిరాకరించొచ్చు: ఎన్‌ఎంసీ
విధి నిర్వహణలో ఉండగా రోగులు అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు అనుమతి ఇస్తున్నట్టు ఎన్‌ఎంసీ తెలిపింది.
By అంజి Published on 11 Aug 2023 11:22 AM ISTఅనుచితంగా ప్రవర్తిస్తే వైద్యం నిరాకరించొచ్చు: ఎన్‌ఎంసీ
జాతీయ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో రోగులు, వారి బంధువులు అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే.. వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు పర్మిషన్ ఇచ్చింది. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై రోగులు, వారి బంధువుల దాడులు, దుర్భాషలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌ఎంసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే వృత్తిపర ప్రవర్తనా నియమావళి ప్రకారం.. డాక్టర్లు ఏ ఔషధ బ్రాండ్, మందు, పరికరాలకు ప్రచారం చేయరాదని ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ ఈ నెల 2న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎన్‌ఎంసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు) లు, వారి కుటుంబ సభ్యులు మందుల కంపెనీలు, వాటి ప్రతినిధులు, కార్పొరేట్, ఇతర ఆస్పత్రుల నుంచి ఎలాంటి బహుమతులు, ఉచిత ప్రయాణాలు, నగదు, ఇతర ప్రయోజనాలేవీ స్వీకరించరాదంటూ నిబంధనలు విధించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు లేదా అనుబంధ ఆరోగ్య రంగం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్పాన్సర్‌షిప్‌లను కలిగి ఉన్న సెమినార్, వర్క్‌షాప్, సింపోసియా, కాన్ఫరెన్స్ వంటి థర్డ్-పార్టీ విద్యా కార్యకలాపాలలో ఆర్‌ఎంపీలు పాల్గొనకూడదు. రోగికి చికిత్స అందించే ముందు.. చికిత్స ఖర్చు యొక్క సహేతుకమైన అంచనాను అందించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.
రోగిని పరీక్షించే ముందు లేదా చికిత్స చేసే ముందు కన్సల్టేషన్ ఫీజులు రోగికి తెలియజేయాలి. "సూచించిన విధంగా రుసుము చెల్లించకపోతే ఆర్‌ఎంపీ రోగికి చికిత్స చేయడానికి లేదా చికిత్సను కొనసాగించడానికి నిరాకరించవచ్చు. అదే సమయంలో, ఇది ప్రభుత్వ సేవ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వైద్యులకు వర్తించదు" అని నిబంధనలు పేర్కొంటున్నాయి. డ్యూటీ సమయంలో లేదా ఆఫ్-డ్యూటీ సమయంలో ఆల్కహాల్ లేదా ఇతర మత్తు పదార్థాలను ఉపయోగించడం వృత్తిపరమైన అభ్యాసాన్ని ప్రభావితం చేయగల దుష్ప్రవర్తనగా పరిగణించబడుతుందని కూడా పేర్కొంది.