రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలు కావడంతో సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది.
By అంజి Published on 26 Jan 2024 2:08 AM GMTరిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలు కావడంతో సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. వాస్తవానికి భౄరత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. అయితే.. రెండు నెలలు ఆగి కేవలం జనవరి 26వ తేదీనే ఎంచుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం తెలియాలంటే.. చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే.
ధన మాన ప్రాణ త్యాగాలు..
వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు.. నాటి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుని విభజించు పాలించు అంటూ.. దాదాపు 2 శతాబ్దాలకుపైగా పాలించారు. సుదీర్ఘ పోరాటం, వేలాది మంది ధన మాన ప్రాణ త్యాగాల తర్వాత 1947 ఆగస్టు 15 స్వాతంత్రం లభించింది. అప్పటి వరకు అమలులో ఉన్న బ్రిటీష్ భారత ప్రభుత్వ చట్టం - 1935 మనకు వద్దని, మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలనుకున్నాం..
అతి పెద్ద లిఖిత రాజ్యాంగం..
రాజ్యాంగాన్ని రూపొందించానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని నియమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము. అందుకు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలని జనవరి 26న పూర్ణ స్వరాజ్య తీర్మానం రోజు కోసం వేచి ఉన్నారు.
పూర్ణ స్వరాజ్య తీర్మానం..
బ్రిటీషర్ల నుంచి.. కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు అనుకున్న సమయంలో జలియన్‌వాలాబాగ్ అందరి కళ్లను తెరిపించింది. దీంతో సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వివిధ నేతలు చేసిన పోరాటాల తర్వాత లాహోర్ వేదికగా 1930 జనవరి 26న నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి, స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటీషర్లకు వినిపించారు. ఆ రోజే స్వాతంత్ర్య దినోత్సవమని ప్రజలకు పిలుపునిచ్చారు.
సంపూర్ణ స్వరాజ్యం
అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ జనవరి 26వ తేదీకి చిరస్థాయిని కల్పించాలన్న సదుద్దేశంతో నవ భారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తైనా.. మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. 1950 జనవరి 26 నుంచి బ్రిటీష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం - 1935 రద్దయ్యింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా అవతరించింది.