ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకుంది. మంత్రులకు పలు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కేటాయిస్తూ షిండే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి షిండే, పట్టణాభివృద్ధి, రవాణా, పర్యావరణం, మైనారిటీ, విపత్తు నిర్వహణ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
ఫడ్నవీస్ ఆర్థిక, హోం శాఖను కూడా నిర్వహిస్తారని, బీజేపీ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన పేర్కొంది. బీజేపీ మంత్రి సుధీర్ ముంగంటివార్‌ను అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖలను నియమించారు. ఆయన గతంలో కూడా అటవీ శాఖను నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాలను కూడా చూస్తారు.
రవీంద్ర చవాన్‌కు పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మినహా), ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. బీజేపీ నాయకులకు కేటాయించబడిన ఇతర ప్రధాన శాఖలలో గిరీష్ మహాజన్‌కు గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమం శాఖలను ఇచ్చారు. తానాజీ సావంత్‌కు పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్ శాఖ కేటాయించబడింది. గులాబ్రావ్ పాటిల్‌కు నీటి సరఫరా, పారిశుద్ధం, సంజయ్ రాథోడ్‌కు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌ను కేటాయించారు.