వింత పిటిషన్.. 'నేను బిడ్డను కనాలనుకుంటున్నాను నా భర్తకు బెయిలివ్వండి'
Do prisoners have right to procreate Uttarakhand HC to find out.
By తోట వంశీ కుమార్ Published on 7 Aug 2021 4:13 AM GMTఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ వింత అభ్యర్థన వచ్చింది. తాను బిడ్డను కనాలనుకుంటున్నానని, తన భర్తకు బెయిల్ ఇవ్వాలని అంటూ ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే.. ఆమె భర్త అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడం ఇక్కడ గమనార్హం. రేపిస్టు భర్తతో బిడ్డను కనాలని ఉందంటూ ఆ మహిళ చేసిన అభ్యర్థన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసిన అభ్యర్థనపై సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. అయితే.. వివాహం జరిగిన మూడు నెలలకే తన భర్త జెలు కెళ్లాడని, దీంతో తమకు కలిసి ఉండే అవకాశం లభించలేదని సచిన్ భార్య వాపోయింది. మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నానని... తన భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టుకు ఆశ్రయించింది.
మాతృత్వంలోని మాధుర్యం అనుభవించాలని ఉందని.. ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉందని వేడుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారించింది. కాగా.. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పిటిషన్ రాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అనుమానాలను లేవనెత్తింది.
'అత్యాచారం కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా..? ఈమె భార్యగా నా హక్కు అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే కలిగే సంతానం కూడా బిడ్డలుగా మా హక్కు అనే అవకాశం ఉంది కదా' అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో సలహా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులు ఎక్కడైనా ఉంటే.. ఏం జరిగిందనే విషయాలపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.