సనాతనా ధర్మాన్ని హెచ్.ఐ.వీ. తో పోల్చిన డీఎంకే నేత
డీఎంకే నేత సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Sept 2023 8:45 PM ISTసనాతనా ధర్మాన్ని హెచ్.ఐ.వీ. తో పోల్చిన డీఎంకే నేత
సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపగా.. మరో డీఎంకే నేత సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చారు. డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా సనాతన ధర్మాన్ని సామాజిక రుగ్మత అని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ మలేరియా, డెంగీతో పోల్చగా.. రాజా సనాతన ధర్మాన్ని ఏకంగా హెచ్ఐవీతో పోల్చారు. సనాతన ధర్మంపై చర్చకు అనుమతిస్తే.. సమాధానాలు ఇవ్వడానికి తాను సిద్ధమేనని అన్నారు. ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను అనుమతిస్తే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. ఏది సనాతన ధర్మమో తాను వివరిస్తానని రాజా అన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. దీనిపై అమిత్ షా లేదా ఇతర బీజేపీ ముఖ్య నేతలు ఎవరైనా తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మణిపూర్ లాంటి అతి పెద్ద సమస్యని వదిలేసి తన వ్యాఖ్యలతో రాజకీయం చేస్తోందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారని, తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అనవసరంగా ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని డీఎంకే నేతలకు కూడా సూచించారు.