విద్యార్ధుల‌కు ఉచిత షూల‌ కోసం భిక్షాట‌న చేస్తా : డీకే శివ‌కుమార్‌

DK Shivakumar says will beg and borrow over free shoes socks to govt students. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచిత షూలు, సాక్స్‌ల పంపిణీ వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌, విద్యాశాఖ

By అంజి  Published on  8 July 2022 4:59 PM IST
విద్యార్ధుల‌కు ఉచిత షూల‌ కోసం భిక్షాట‌న చేస్తా : డీకే శివ‌కుమార్‌

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచిత షూలు, సాక్స్‌ల పంపిణీ వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌, విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ స్కీమ్‌కు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే తాను కర్ణాటక వీధుల్లో భిక్షాటన చేసి విద్యార్థులందరికీ ఉచిత షూలు, సాక్స్‌లు అందిస్తానని డీకే శివకుమార్ అన్నారు. విద్యార్థులను ఆదుకునేందుకు ఎన్నో సంస్థలున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌లోనూ తాము రెండు శాతం రెండు శాతం నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సేకరించామని, వాటిని సమీకరించి చిన్నారులకు వెచ్చిస్తామని తెలిపారు.

పిల్లలు చదువు కోసం మాత్రమే స్కూళ్లకు వెళ్లాలని, షూలు, సాక్స్‌ల కోసం కాదని కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ బీసీ నగేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. మరోవైపు మంత్రి కామెంట్స్ అమానవీయంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆక్షేపించారు. చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్లే పిల్లల కష్టం గురించి తెలిస్తే ఆయన అలా మాట్లాడి ఉండరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ హయాంలో పేద విద్యార్థులకు అవసరమైన పథకాలను తాము అమలు చేశామని, విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకునేలా చేశామని చెప్పుకొచ్చారు. అయినా పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన మీకు (మంత్రి బీసీ నగేష్) ఎలా తెలుస్తాయంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

ఈ విషయమై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, సాక్స్‌లు, యూనిఫాంలను కొనుగోలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపక్షాలు సమస్య సృష్టించాల్సిన అవసరం లేదని అన్నారు.

Next Story