కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులోకి ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ వెళ్లనున్న దిగ్విజయ సింగ్ సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై తాను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని దిగ్విజయ్ సింగ్ తెలిపారు."నేను నామినేషన్ దాఖలు చేయడం గురించి ఆలోచిస్తున్నాను, అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. నేను ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకుని తుది నిర్ణయం తీసుకుంటాను" అని ఆయన అన్నారు. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వాన్ని కలుస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు తర్వాత అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ పదవికి పోటీ చేయడంపై కష్టమనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు దిగ్విజయ సింగ్, కెసి వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే పేర్లు పోటీలో నిలబడే వ్యక్తులకు సంబంధించి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అక్టోబర్ 17న జరిగే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని రాహుల్ గాంధీ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో ఓటమిని చవిచూడడంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టారు సోనియా గాంధీ.