షిండేను కలిసిన ఫడ్నవీస్.. 'నెంబర్ టూ'కు అంగీకారం..!
చాలా రోజుల పాటు అనేక రౌండ్ల చర్చల తర్వాత.. మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి, ప్రముఖ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే కొత్త మహాకూటమి ప్రభుత్వంలో 'నెంబర్ టూ' పాత్రను అంగీకరించడానికి అంగీకరించారు.
By Medi Samrat Published on 3 Dec 2024 9:30 PM ISTచాలా రోజుల పాటు అనేక రౌండ్ల చర్చల తర్వాత.. మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి, ప్రముఖ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే కొత్త మహాకూటమి ప్రభుత్వంలో 'నెంబర్ టూ' పాత్రను అంగీకరించడానికి అంగీకరించారు. మహాయుతి అద్భుత విజయానికి రూపశిల్పి అయిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు అడ్డంకి తొలగింది. దీంతో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆయన ఎన్నిక కానున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఖరారు చేసేందుకు ఈ సాయంత్రం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో షిండే, ఫడ్నవీస్ సమావేశమయ్యారు. రెండో ఉప ముఖ్యమంత్రిగా భావిస్తున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరు కాలేదు.
ఫడ్నవీస్ గురువారం మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతకు ముందు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతని మొదటి పదవీకాలం ఐదు సంవత్సరాలు కాగా,, రెండవది 80 గంటలు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 11 రోజుల తర్వాత ఇవాళ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
మధ్యాహ్నం తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే థానేలోని తన వ్యక్తిగత నివాసం నుండి థానేలోని జూపిటర్ ఆసుపత్రికి చేరుకున్నారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న షిండే.. అక్కడ జనరల్ చెకప్ చేయించుకున్న తర్వాత నేరుగా దక్షిణ ముంబైలోని తన అధికారిక నివాసం 'వర్ష'కు వెళ్లారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేత గిరీష్ మహాజన్ సాయంత్రం ముందుగా ఆయనను కలిశారు.
దాదాపు అరగంట పాటు షిండే, మహాజన్ మధ్య సంభాషణ తర్వాత.. మహాజన్ కొద్ది దూరంలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసమైన 'సాగర్' బంగ్లాకు వెళ్ళాడు. ఇద్దరు నేతల మధ్య కొన్ని నిమిషాల సంభాషణ అనంతరం ఫడ్నవీస్ స్వయంగా ఏకనాథ్ షిండేను కలిసేందుకు 'వర్ష'కు చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.
ఈ భేటీ తర్వాత ఇరు పక్షాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ, ఉప ముఖ్యమంత్రి పదవికి షిండే అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటి వరకు హోం శాఖను తన వద్దే ఉంచుకోవాలని పట్టుబట్టారు. కానీ బహుశా ఇప్పుడు ఆయన దీన్ని కూడా విడిచిపెట్టడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. అసలు శివసేన ఎవరో షిండే నిరూపించారని శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ అన్నారు. కాబట్టి బీజేపీ షిండే గౌరవాన్ని నిలబెట్టాలని వ్యాఖ్యానించారు.