ఔరంగజేబుపై 'ప్రజలలో కోపానికి' ఛావా సినిమానే కారణం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి వివాదం తర్వాత నాగ్‌పూర్‌లోని మహల్, హన్స్‌పురిలో రెండు వర్గాల మధ్య హింస జరిగింది.

By Medi Samrat
Published on : 18 March 2025 2:48 PM IST

ఔరంగజేబుపై ప్రజలలో కోపానికి ఛావా సినిమానే కారణం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి వివాదం తర్వాత నాగ్‌పూర్‌లోని మహల్, హన్స్‌పురిలో రెండు వర్గాల మధ్య హింస జరిగింది. హింసాకాండలో పలువురి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ విష‌య‌మై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన వెలువడింది. ఈ హింసాత్మక ఘటన, అల్లర్లు ముందే ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోందని సీఎం అన్నారు. ఔరంగజేబుపై ప్రజల ఆగ్రహాన్ని చావా చిత్రం రెచ్చగొట్టిందని, ఇప్పటికైనా మహారాష్ట్రలో శాంతిభద్రతలు కాపాడాలని సీఎం అన్నారు. పోలీసులపై దాడులను సహించేది లేదని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫడ్నవీస్ తెలిపారు. ఈ హింసాకాండలో పలువురు పోలీసు అధికారులు గాయపడి ఆస్పత్రిలో చేరారని తెలిపారు.

తాజాగా ఈ హింసకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ల ప్రదర్శనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో చెలరేగిన హింసాకాండ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించిన దుండగులు వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు రాళ్లు రువ్వారు.

గత రాత్రి 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్స్‌పురి ప్రాంతంలో కూడా ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కొంత మంది వ్య‌క్తులు వాహనాలను తగులబెట్టారు.. ఆ ప్రాంతంలోని ఇళ్ళు, క్లినిక్‌ను ధ్వంసం చేశారు. అల్లరిమూకలు ప్రజల ఇళ్లపైకి కూడా రాళ్లు రువ్వారు. మహల్‌లోని చిట్నిస్ పార్క్ సమీపంలోని ఓల్డ్ హిస్‌లాప్ కాలేజ్ ప్రాంతంలోని కొంతమంది నివాసితులు రాత్రి 7.30 గంటలకు తమ ప్రాంతంలోకి ప్రవేశించి ఇళ్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారని, వీధుల్లో ఆగి ఉన్న అనేక కార్లను ధ్వంసం చేశారని స్థానికులు పేర్కొన్నారు.

Next Story