మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కొవిడ్
Deputy CM Ajit Pawar says 10 Ministers Over 20 MLAs Tested positive.కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మళ్లీ పంజా
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మళ్లీ పంజా విసురుతోంది. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఆ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సిబ్బందికి వరుసగా కరోనా పాజిటివ్‌గా తేలుతోంది. 10 మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. రాష్ట్రంలో కేసులు ఇలాగే పెరుగుతూ ఉంటే.. కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ఇక నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 50 శాతం పెరిగినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చెప్పింది.
ఈ మహమ్మారి కట్టడికి ఆంక్షలు విధించే అవకాశాలపై పవార్‌ను ప్రశ్నించగా.. కేసుల సంఖ్యను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు. రోగుల సంఖ్య పెరిగితే కఠిన ఆంక్షలు తప్పవన్నారు. ఆ పరిస్థితిని నివారించడానికి ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూని విధించారని తెలిపారు. ముంబై, పుణెలో అత్యధికంగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ముంబైలో శుక్రవారం 5631 కేసులు నమోదు అయ్యాయి. గురువారంతో పోలిస్తే 2వేల కేసులు అధికంగా వచ్చాయి. దీంతో ఆ నగరంలో కేసులు 7,85,110కి చేరింది. ఇక పుణె నగరంలో 5,10,218కి పెరిగింది. ఇక ఇప్పటికే జనసమూహాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఇక నిన్న దేశ వ్యాప్తంగా 11,10,855 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 22,775 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,61,579కి చేరింది. నిన్న ఒక్క రోజే 406 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,81,486కి చేరింది. నిన్న 8,949 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,42,75,312కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది.