బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్న తాత
Depressed centenarian attends his own funeral.ఉత్తరాఖండ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. బతికుండగానే అంత్యక్రియలు చేసుకున్న తాత.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2021 9:46 AM GMTఉత్తరాఖండ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణానంతరం జరగాల్సిన అంత్యక్రియలను ఓ శతాధిక వృద్దుడు తాను బతికుండగానే నిర్వహించుకున్నాడు. అందుకు గ్రామపంచాయతీ, గ్రామానికి చెందిన పూజారి, గ్రామస్తులు కూడా సహకరించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో రూప్ రామ్ నివసిస్తున్నాడు. ఆయన వయసు 103 ఏళ్లు. ఇద్దరు కూతుర్లు ఉన్నా.. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. గత కొన్ని ఏళ్లుగా గ్రామంలో ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తన మరణానంతరం అందరిలాగా సాంప్రదాయం ప్రకారం తనకు అంత్యక్రియలను నిర్వహించేవారెవ్వరూ లేరని ఆందోళన చెందేవాడు. ఈ విషయాన్ని పూజారీ వద్ద ప్రస్తావించగా.. పున్నామ నరకం నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా తమకు తామే అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పాడు.
అంతే.. ఇంకా ఏం ఆలోచించదలచుకోలేదు. వెంటనే తన అంత్యక్రియలను తానే నిర్వహించుకోవాలని అనుకున్నాడు. విషయాన్ని గ్రామ పెద్దలతో పాటు గ్రామస్తులకు తెలియజేశాడు. వారందరూ సహకరించడంతో.. హిందూ సంప్రదాయాల ప్రకారం మంత్రోచ్చరణలు, బ్యాండ్ మేళం చప్పుళ్లతో ఘనంగా తంతు జరిపించుకున్నాడు. అనంతరం గ్రామస్థులకు భారీ విందు ఏర్పాటు చేశాడు. ఒంటరి జీవిని అయిన తనకు అంత్యక్రియలు నిర్వహించే వాళ్లు ఎవరూ లేకపోవడంతోనే ఇలా కర్మకాండలు చేసుకున్నానని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా కంటతడి పెట్టారు.