బయట ఏదైనా తిందామన్నా, తాగుదామన్నా భయపడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఎందులో, ఏది కలుపుతున్నారో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు, రిపోర్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి. తాజాగా అలాంటిది ఓ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని రాజిందర్ నగర్ ప్రాంతంలో రసాయనాలు కలిపిన దానిమ్మ రసాన్ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో విక్రయించే జ్యూస్‌లో రసాయనం కలుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
షాప్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు అయూబ్ ఖాన్, రాహుల్ తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు. షాపు యజమాని షోయబ్ జ్యూస్‌లో రసాయనాన్ని కలపమని తమకు సూచించాడని నిజం ఒప్పేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలం నుండి సంబంధిత పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నివేదిక ఆధారంగా నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.