ఎన్నో రోజులుగా శాంతియుతంగా సాగుతూ వచ్చిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు హింసాత్మకంగా మారిపోయిన సంగతి తెలిసిందే..! ఈ హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని పోలీసులు పట్టుకుంటూ ఉన్నారు. ఎర్రకోట హింసాత్మక ఘటనలో మోస్ట్ వాటెండ్ మనీందర్ సింగ్ ఎట్టకేలకు చిక్కినట్లు తెలుస్తోంది.
గణతంత్ర దినోత్సవం నాటి ఘటనలో మనీందర్ సింగ్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పీటమ్‌పురాలోని అతని నివాసం నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలకు సబంధించి ఇప్పటికే దీప్ సిద్దూ, ఇక్బాల్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రైతు సంఘాలు, జనవరి 26 న ట్రాక్టర్ ర్యాలీ కి పిలుపునిచ్చాయి. ఢిల్లీ పోలీసులు దీనికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కానీ కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొట్టి, ర్యాలీ హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారు. పోలీసుల విధులను ఆటంకపరచటమే కాకుండా ఉద్యమాన్ని హింసవైపు ప్రేరేపించి, ఎర్రకోటపై మతపరమైన జెండాను ఎగురవేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.