కేజ్రీవాల్ అరెస్ట్ అయితే.. జైలులోనే కేబినెట్ సమావేశాలు: ఢిల్లీ మంత్రి
ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఆప్ ఎమ్మెల్యేలు అందరూ అత్యవసరంగా సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 9:30 PM ISTకేజ్రీవాల్ అరెస్ట్ అయితే.. జైలులోనే కేబినెట్ సమావేశాలు: ఢిల్లీ మంత్రి
ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఆప్ ఎమ్మెల్యేలు అందరూ అత్యవసరంగా సమావేశం అయ్యారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఇటీవల ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. దీన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా పేర్కొన్నారు ఆప్ ఎమ్మెల్యేలు. అంతేకాదు.. ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు కావడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ మంత్రులు, నేతలపై వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకవేళ అరెస్ట్ చేసినా సరే..ఆయనే సీఎంగా కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలు అంతా కోరినట్లు వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదేనని.. దాన్ని కొనసాగించాలని చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అర్వింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ సహా, బీజేపీ నాయకులంతా భయపడుతున్నారని చెప్పారు. ఎన్నికల ద్వారా కేజ్రీవాల్‌ను అధికారం దూరం చేయలేమని బీజేపీకి తెలుసు.. అందుకే కుట్రలు చేస్తోందని ఆప్ ఎమ్మెల్యేలంతా అభిప్రాయం వ్యక్తం చేశారని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.
కేంద్రం ఇలాగే కుట్రలు చేసి కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అధికారులు సైతం అక్కడికే వెళ్లి పనులు చేసుకుంటారని అన్నారు. మమ్మల్ని పిలిచినా కూడా సంతోషంగా వెళ్తామని చెప్పారు మంత్రి సౌరభ్ భరద్వాజ్. అయితే.. ఆప్ ముఖ్యనేతలను కూడా త్వరలోనే జైలుకు తరలించే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. అతిషీని జైలు నెంబర్ 2లో ఉంచితే.. తనని జైలు నెంబర్ 1లో పెడతారంటూ చెప్పుకొచ్చారు సౌరభ్. అలా చేస్తే జైలులోనే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటామన్నారు. ఢిల్లీ ప్రజలకు పనులు ఆపకుండా చూస్తామన్నారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్.