ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల కస్టడీ సోమవారంతో ముగియడంతో వారిని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో నిందితులకు కోర్టులో చుక్కెదురైంది. బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు 14 రోజుల జ్యుడీషియల్ ఈడీ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు. ఈ మేరకు జైలులో బినోయ్ బాబుకు వాటర్‌ఫ్లాస్క్, ఇంటి భోజనం, రెండు జతల బట్టలు, ఘూస్ వంటి వాటిని అనుమతించింది. శరత్ చంద్రారెడ్డికి ఇంటి భోజనం తోపాటు, క్రోనిక్ బ్యాక్ పెయిన్ వైద్య చికిత్స, హైపర్ టెన్షన్ మందులు, ఉలెన్ బట్టలు, షూస్ వంటి వాటికి కోర్టు అనుమతించింది. లిక్కర్ స్కామ్‌లో ఇద్దరూ నిందితులను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు, నిందితులకు కస్టడీని మరిన్ని రోజులు పొడిగించాల్సిందిగా అభ్యర్థించారు. అవెన్యూ కోర్టు వారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అవెన్యూ కోర్టు డిసెంబర్ 5కు వాయిదా వేసింది.