ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డి, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్‌పై శరత్ చంద్రారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. శరత్ కొంతకాలంగా ఈడీ కనుసన్నలల్లో ఉన్నాడు. పెనక శరత్ చంద్రా రెడ్డి ప్రస్తుతం అరబిందో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెనక రాంప్రసాద్ రెడ్డి కుమారుడు. గతంలో కూడా హవాలా లావాదేవీల వ్యవహారంలో శరత్‌ను అధికారులు ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్‌లోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విధానపరమైన నిర్ణయాలను తెలుసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఈ విచారణలో భాగంగా, ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డికి అనేక రాజకీయ నాయకులు, సంస్థలతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీశారు. గతంలో శరత్‌చంద్రారెడ్డి కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లపై దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మూడు రోజుల విచారణ అనంతరం పెన్నాక శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గతంలోనే హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.