వైట్ ఫంగస్‌ వల్ల పేగుల్లో రంధ్రాలు.. ఢిల్లీలో మొదటి కేసు

the white fungus causing severe damage to the intestine.ఫంగస్‌ వల్ల ఓ బాధితురాలి చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయని వైద్యులు గుర్తించారు. దిల్లీలో నమోదైన తొలి క్యాండిడా ఇన్‌ఫెక్షన్‌ కేసు ఇదేనని వైద్యులు వెల్లడించారు.

By Medi Samrat  Published on  27 May 2021 2:47 PM GMT
వైట్ ఫంగస్‌ వల్ల పేగుల్లో రంధ్రాలు.. ఢిల్లీలో మొదటి కేసు

ఒకవైపు కరోనా ప్రపంచాన్ని కకావికలం చేస్తుంటే మరోవైపు ఫంగస్లు మరింత భయపెడుతున్నాయి. కరోనా నుంచి కోలుకొని క్షేమంగా ఇంటికి చేరారని ఆనందించే లోపే ఫంగస్‌లు వ్యాపించి ప్రాణాల మీదకు తెచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బ్లాక్‌, వైట్‌, యెల్లో అంటూ మూడు వేర్వేరు ఫంగస్‌లను గుర్తించారు. ఇప్పుడు వైట్‌ ఫంగస్‌ బారిన పడిన వ్యక్తిలో మరో అరుదైన లక్షణాలు కనిపించాయి. ఫంగస్‌ వల్ల ఓ బాధితురాలి చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయని వైద్యులు గుర్తించారు. దిల్లీలో నమోదైన తొలి క్యాండిడా ఇన్‌ఫెక్షన్‌ కేసు ఇదేనని వైద్యులు వెల్లడించారు.

ఈ నెల 13న ఒక మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఢిల్లీలోని సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల్లో ఆమె ఆహార నాళికల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించిన డాక్టర్లు పలు సర్జరీలు నిర్వహించి పేగు నమూనాలను తదుపరి పరీక్షలకు పంపించారు. ఆమెకు వైట్‌ ఫంగస్‌ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారించారు. క్యాండిడా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జీర్ణకోశంలోని పేగులు ఛిద్రమైనట్లు గుర్తించామని డిల్లీలోని సర్‌గంగారాం ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ అనిల్‌ ఆరోరా తెలిపారు.

నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి మహిళ ఆహార పైపు, చిన్న పేగు, పెద్ద పేగులలోని రంధ్రాలు మూసివేశారు. బాధితురాలి శరీరం లోపల ద్రవం లీకేజీని ఆపడానికి ఈ శస్త్రచికిత్స సహాయపడుతుందన్నారు.

క్యాన్సర్‌తో ఇబ్బంది పడిన ఆ మహిళ గత డిసెంబరులో సర్జరీ చేయించుకొని తరువాత నాలుగు వారాల పాటు కీమోథెరపీ కూడా తీసుకున్నట్టు తెలిపారు. కొవిడ్‌ నిర్ధారణ కావడం, కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఆమెలో రోగనిరోధకత మరింత క్షీణించినట్లు పేర్కొన్నారు.

స్టెరాయిడ్ వాడకం వల్ల ఇటీవల పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో కొన్ని చోట్ల పేగులకు రంధ్రాలు పడిన కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే వైట్‌ ఫంగస్‌ కేసులో.. పేగుల్లో రంధ్రాలు ఏర్పడిన కేసు ప్రపంచంలో ఇది మొదటిదని డాక్టర్లు చెబుతున్నారు.

Next Story
Share it