ఇంట్లో నోట్ల కట్టల కేసు, ఢిల్లీ హైకోర్టు జడ్జిపై వేటు
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను న్యాయ విధుల నుంచి వెంటనే దూరంగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik
ఇంట్లో నోట్ల కట్టల కేసు, ఢిల్లీ హైకోర్టు జడ్జిపై వేటు
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను న్యాయ విధుల నుంచి వెంటనే దూరంగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్‌సైట్‌లో పెట్టింది. వెబ్‌సైట్‌లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు.
అయితే జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీ హైకోర్టు సీజేకు ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. తాను గానీ, తన బంధువులు గానీ ఎటువంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు.