నేషనల్ హెరాల్డ్ కేసు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను వెంటాడుతూ ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులకు ఢిల్లీ హైకోర్టు మరింత సమయం ఇచ్చింది. మే 18 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ జస్టిస్ సురేశ్ కుమార్ కైట్ కేసు విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 22న డాక్టర్ స్వామి పిటిషన్‌పై సోనియా, రాహుల్‌గాంధీ సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ (వైఐ) లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ట్రయల్ కోర్టు చర్యలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, కరోనా కారణంగా తమ కార్యాలయాన్ని మూసివేయడంతో సమాధానం ఇవ్వలేకపోయామంటూ కాంగ్రెస్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు తాజాగా మే 18 వరకు గడువు పొడిగిస్తూ తీర్పును ఇచ్చింది.