కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సోమవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది

By Medi Samrat  Published on  5 Aug 2024 4:05 PM IST
కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సోమవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు. దిగువ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతితో పాటు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. అంత‌కుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు రోస్ అవెన్యూ కోర్టు జూలై 25న పొడిగించింది. ఆయన ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసుల్లో ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుండి మధ్యంతర బెయిల్ లభించింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నేత కవిత కూడా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో బీఆర్‌ఎస్ నేత కె. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 7కి వాయిదా పడింది. వాదనలకు సమయం కావాలని న్యాయవాది కోరారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఆయన డిఫాల్ట్ బెయిల్‌ను కోరారు.

Next Story