దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం సృష్టించింది. దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది.
నైరుతి ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మనోజ్.సి తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. అయితే.. తెల్లవారుజామున 4:40 గంటలకు ఆర్కే పురం పోలీసు స్టేషన్‌కు కాల్ వచ్చిందని.. కొందరు దుండగులు వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారని చెప్పారు. ఇక హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అప్పటికే రక్తపు మడుగులో ఇద్దరు మహిళలు పడి ఉన్నారు. పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే తీవ్రగాయాలపాలైన పింకీ (30), జ్యోతి (29) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు మృతుల సోదరుడి కోసం వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ మనోజ్ చెప్పారు. అయితే.. నిందితులు వచ్చిన సమయంలో అక్కడ సదురు వ్యక్తి లేకపోవడంతో.. అతని సోదరులను కాల్చి చంపారని భావిస్తున్నట్లు చెప్పారు. డబ్బు లావాదేవీల విషయంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు దొరికితేనే నిజానిజాలు తేల్చగలమని పోలీసులు తెలిపారు. జంట హత్యలు చేసిన నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు డీసీపీ మనోజ్ చెప్పారు.