మందు తాగాలన్నా, కొనాలాన్నా మొన్నటి వరకూ ఢిల్లీ పౌరులు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు అంత ఎదురుచూపులు అవసరం లేదు. మద్యం సేవించేందుకు అవసరమైన చట్టబద్ధ వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు కుదించినట్లు సోమవారం ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా వెల్లడించారు.
దిల్లీ కేబినెట్ కొత్త మద్యం పాలసీని ఆమోదించింది. ఈ కొత్త విధానంలో ఆప్ సర్కార్ చేసిన పలు మార్పుల్లో భాగంగా మద్యం తాగే వయస్సును కుదించారు. అలాగే ఈ కొత్త పాలసీ ప్రకారం.. దిల్లీ నగరంలో నూతన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని.. అలాగే, నగరంలో మద్యం దుకాణాలు నిర్వహించరాదని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మద్యం తాగే వయస్సును 21కి మార్చాలని గతేడాది డిసెంబర్‌లో సిపారసు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దిల్లీలో 60శాతం లిక్కర్ దుకాణాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయని సిసోడియా తెలిపారు. మద్యం ఢిల్లీ ప్రభుత్వం సంస్కరణలతో వార్షిక ఎక్సైజ్ ఆదాయంలో కనీసం 20 శాతం పెంపును ఆశిస్తోందని అన్నారు.
ఈ మార్పులతో నగరంలో లిక్కర్ మాఫియాకు కళ్లెం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో 850 మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, కానీ లిక్కర్ మాఫియా 2వేలకు పైగా అక్రమంగా దుకాణాలను నడుపుతుందని అన్నారు. గత రెండేళ్లలో సుమారు 7 లక్షల అక్రమ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశామని, 1939 మంది నిందితులు అరెస్టు చేశామని తెలిపారు.