ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 13 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  24 May 2024 4:35 PM IST
delhi, fire accident, banquet hall,

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 13 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న కార్నివాల్ బాంక్వెట్ హాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో భారీ పొగ అలుముకుంది. చుట్టుపక్కల ప్రాంతమంతా పొగ కమ్మేసింది. ఈ మంటల్లో బాంక్వెట్‌ హాల్‌ మొత్తం అగ్నికి ఆహుతైపోయింది.

అయితే..అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. 13 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది బాంక్వెట్ హాల్. రోడ్డుపక్కనే ఈ హాల్ ఉండటంతో కాసేపు వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. నరేలా రోడ్‌కి దగ్గరలోనే ఈ హాల్ ఉంది. అలీపూర్‌ ప్రాంతంలో చాలా శుభకార్యాలు ఈ హాల్‌లోనే జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

అయితే.. మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదని ఫైర్ సిబ్బంది చెప్పారు. మంటలు ఇప్పటికైతే ఏమీ లేవని అన్నారు. పెద్ద ఎత్తు ఒక్కసారిగా చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. ఇక ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది కానీ.. ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న ఇతర బిల్డింగుల్లోని వారు వెంటనే బయటకు పరుగులు తీశారు.


Next Story