ఢిల్లీ బడ్జెట్‌ ఖరారు చేస్తున్నా.. విచారణ వాయిదా వేయండి: సిసోడియా

Delhi Excise policy case.. Manish Sisodia urges CBI to defer questioning. ఢిల్లీ: నగర బడ్జెట్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నందున ఢిల్లీ ఎక్సైజ్

By అంజి  Published on  19 Feb 2023 11:24 AM IST
ఢిల్లీ బడ్జెట్‌ ఖరారు చేస్తున్నా.. విచారణ వాయిదా వేయండి: సిసోడియా

ఢిల్లీ: నగర బడ్జెట్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నందున ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం సీబీఐని కోరారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన దాదాపు మూడు నెలల తర్వాత ఈ కేసుకు సంబంధించి ఆదివారం సిసోడియాను విచారణకు పిలిచినట్లు అధికారులు తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడితో పాటు ఇతర అనుమానితులపై విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఛార్జ్ షీట్‌లో నిందితుడిగా పేర్కొనబడలేదు.

''నేను సీబీఐకి లేఖ రాశాను. నేను ఢిల్లీ బడ్జెట్‌ను ఖరారు చేస్తున్నాను. ఇది కీలకమైన సమయం కాబట్టి గత వారం ఫిబ్రవరికి సమయం అడిగాను. ఫిబ్రవరి చివరి వారం తర్వాత వస్తానని చెప్పాను'' అని విలేకరులతో అన్నారు. బడ్జెట్‌ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా తన కర్తవ్యం, దాని కోసం తాను 24 గంటలు పని చేస్తున్నాను అని చెప్పారు. ఫిబ్రవరి చివరి వారం తర్వాత వచ్చి తమ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేందుకు అనుమతించాలని సీబీఐని అభ్యర్థించినట్లు ఆయన తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖకు కూడా మనీష్‌ సిసోడియా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది అక్టోబర్ 17న గతంలో ఆయనను విచారించారు, ఈ కేసుకు సంబంధించి అతని ఇల్లు, బ్యాంక్ లాకర్లలో కూడా సోదాలు జరిగాయి.

Next Story