సోనియా, రాహుల్‌కు షాక్..ఆ కేసులో కోర్టు నోటీసులు
కాంగ్రెస్ మాజీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik
సోనియా, రాహుల్‌కు షాక్..ఆ కేసులో కోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న సామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారి, మెస్సర్స్ యంగ్ ఇండియా, మెస్సర్స్ డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ లకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది.
ఈ కేసులో గతంలో కోర్టు నోటీసు జారీ చేయడానికి నిరాకరించిన తర్వాత ఈ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు పరిశీలన దశలో ఉంది..నిందితులపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యం..
నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీలాండరింగ్ జరిగిందని 2014లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను కోర్టు పరిశీలించిన తర్వాత 2021లో ఈడీ దర్యాప్తుకు ప్రారంభించింది. ఈ ఫిర్యాదులో సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, దివంగత పార్టీ నేతలు మోతీలాల్ వోరా ,ఆస్కార్ ఫెర్నాండెజ్ వంటి కీలక కాంగ్రెస్ ప్రముఖులు, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలు మనీలాండరింగ్ కు కుట్ర చేశారని ఆరోపించింది.
నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) యొక్క రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేయడానికి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ "నేరపూరిత కుట్ర" పన్నారని, 99% వాటాలను కేవలం రూ.50 లక్షలకు బదిలీ చేశారని ED ఆరోపించింది. ఈ ఆస్తులను సోనియా గాంధీ మరియు రాహుల్ నియంత్రణలో ఉన్న యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థ కొనుగోలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు సామ్ పిట్రోడా, సుమన్ దూబేలను నిందితులుగా ఈడీ పేర్కొంది.