అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు: సీఎం కేజ్రీవాల్

జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 May 2024 11:23 AM IST
delhi, cm kejriwal, comments,  bjp,

అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు: సీఎం కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించినా.. కవిత మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్‌ కేసులో జైలుకెళ్లిన తర్వాత కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. జైలు నుంచే పాలన కొనసాగించారు. పలువురు ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఇదే అంశంపై మాట్లాడారు. ఈ మేరకు శనివారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.ఎందుకు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదో చెప్పారు. సీఎం కుర్చీ నుంచి తనని తప్పించేందుకు బీజేపీ నాయకులు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయం తనకు అర్థమైంది కాబట్టే తాను సీఎం పదవికి రాజీనామా చేయలేదని అన్నారు.

అయితే తనకు సీఎం పోస్టు ముఖ్యం కాదని కేజ్రీవాల్ అన్నారు. కానీ.. పదవి నుంచి దింపేయడానికి తప్పుడు కేసులు పెట్టడం... కుట్రలు చేశారీ.. వాటిని తిప్పికొట్టేందుకే సీఎం పోస్టుకు రాజీనామా చేయలేదన్నారు. ప్రధాని మోదీ అవినీతిపై నిజంగానే అవినీతిపై పోరాడాలని అనుకుంటే.. తమను చూసి నేర్చుకోవాలన్నారు. అవినీతికి పాల్పడ్డ మా మంత్రులతో పాటు ఇతరులను జైలుకు పంపామని కేజ్రీవాల్ అన్నారు. ఆప్‌ ను ఎంతగా అణచివేయాలని ఆలోచిస్తే అంత పైకి ఎదుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ తాను జైలు నుంచి బయటకు వస్తానని ఎవరూ అనుకోలేదన్నారు. అందరి ప్రార్థనల ఫలితంగానే తనకు బెయిల్‌ లభించిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.

Next Story