రాత్రంతా లాకప్‌లోనే కేజ్రీవాల్.. ఈడీ 10 రోజుల కస్టడీ కోరే ఛాన్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  22 March 2024 5:10 AM GMT
delhi, cm kejriwal, arrest, ed case, punjab cm bhagwant mann,

రాత్రంతా లాకప్‌లోనే కేజ్రీవాల్.. ఈడీ 10 రోజుల కస్టడీ కోరే ఛాన్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరెస్ట్ కు ముందు కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన్ని పలు ప్రశ్నలు వేసి ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇక రాత్రంతా సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు లాకప్‌లో ఉంచారని తెలుస్తోంది. దాంతో కేజ్రీవాల్ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదనీ.. తెల్లవారుజామునే అల్పాహారం, మందులు తీసుకున్నారని పలువురు అధికారులు చెప్పారు.

ఇక ఉదయమే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు చేయించారు ఈడీ అధికారులు. మరికాసేపట్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే.. కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాన్ని వారు ఈ మేరకు కోరనున్నారు. ఇక లిక్కర్‌ స్కాం కేసులోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్‌, కవితను కలిపి విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

లిక్కర్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఖండించారు. కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్ట్‌ చేస్తారు కానీ.. ఆయన ఆలోచనను బంధించలేరని అన్నారు. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదనీ.. ఆలోచనా విధానమని అన్నారు. తామంతా కేజ్రీవాల్‌తో నిలబడతామని ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు.


Next Story