దమ్ముంటే అరెస్ట్ చేయండి.. బీజేపీకి సీఎం కేజ్రీవాల్ సవాల్

ప్రతిపక్ష నాయకులను తొక్కయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 May 2024 9:30 PM IST
delhi, cm Arvind Kejriwal, challenge,  bjp,

దమ్ముంటే అరెస్ట్ చేయండి.. బీజేపీకి సీఎం కేజ్రీవాల్ సవాల్

ప్రతిపక్ష నాయకులను తొక్కయడమే బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకుందని ఆప్‌ జాతీయ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో తన పీఏ అరెస్ట్‌ అయిన తర్వాత కేజ్రీవాల్‌ ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.

బీజేపీ ప్రతిపక్ష నాయకులపై బెదిరింపులకు పాల్పడుతోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. వారి బెదిరింపులకు లొంగకపోతే కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. అయితే.. తాము అందర్లా కాదు అనీ.. బీజేపీ బెదిరింపులకు భయపడిపోము అన్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ముఖ్య నేతలందరినీ తీసుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నానని కేజ్రీవాల్ ప్రకటించారు. అక్కడ బీజేపీ వారికి కావాల్సిన వారిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టొచ్చని సవాల్‌ విసిరారు. బీజేపీ ఇప్పటికే మనీశ్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ను జైల్లో పెట్టిందని అన్నారు. తాజాగా తన పీఏను కూడా అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ అన్నారు. రాఘవ్‌ చద్దా లండన్ నుంచి వస్తున్నాడని వాళ్లే చెబుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఆయన్నీ కూడా బీజేపీ వారు జైల్లో పెడతారని కామెంట్స్ చేశారు.

అంతేకాదు ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్‌ను, అతిషీని కూడా జైల్లో పెడతామని బీజేపీ వారే చెబుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఇంకెంత మందిని జైల్లో పెడతారని ప్రశ్నించారు. కేంద్రం ఎందుకు ఇలా తమ వెంట పడుతుందో అర్థం కావడం లేదన్నారు. ఏం తప్పు చేశామని ఇలా వేధింపులకు గురి చేస్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీ చేయలేని విధంగా ఢిల్లీలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామనీ.. అదే తాము చేసిన తప్పా అంటూ నిలదీశారు. అలాగే నగర వాసుల కోసం మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేసి మంచి వైద్యం అందించడం.. మందులు ఇవ్వడమే చేసిన తప్పా అన్నారు. బీజేపీ పనులు చేయదు.. చేసే వారిని ఇలా ఇబ్బందులకు గురి చేస్తుంది అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు.


Next Story